2021
దైవసమూహము అంటే ఏమిటి?
జూన్ 2021


దైవసమూహము అంటే ఏమిటి?,” లియహోనా, జూన్ 2021

జూన్ 2021, లియహోనా నెలవారీ సందేశము

దైవసమూహము అంటే ఏమిటి?

పరలోక తండ్రి, యేసు క్రీస్తు, మరియు పరిశుద్ధాత్మ ఒకే ఉద్దేశము గల ముగ్గురు వేర్వేరు ప్రాణులు.

మొదటి దర్శనము

మొదటి దర్శనము నుండి వివరణ, జోన్ మెక్‌నాటన్ చేత

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు దేనిని నమ్ముతారని ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను ఒకసారి వార్తాపత్రిక సంపాదకుడు అడిగాడు. జవాబుగా, ప్రవక్త మనము విశ్వాస ప్రమాణములని పిలిచే నమ్మకముల యొక్క 13 ప్రకటనలను వ్రాసెను. మొదటి ప్రకటన ఇలా చెప్పును, “నిత్యుడగు తండ్రియైన దేవుడిని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును, పరిశుద్ధాత్మను మేము నమ్ముచున్నాము” (విశ్వాస ప్రమాణములు 1:1). ఈ ముగ్గురిని కలిపి మనము దైవసమూహము అని పిలుస్తాము.

నిత్య తండ్రియైన దేవుడు

దేవుడు మాంసము, ఎముకలు గల పునరుత్థానము చెందిన శరీరము. ఆయన మన ఆత్మలకు తండ్రి. ఆయన తన పిల్లలలో ప్రతిఒక్కరిని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు పరిపూర్ణుడు, సమస్త శక్తిని కలిగియున్నాడు మరియు సమస్తమును ఎరిగియున్నాడు. ఆయన న్యాయవంతుడు, కరుణగలవాడు, మరియు దయగలవాడు. మనము జన్మించకముందు దేవునితో ఆత్మ బిడ్డలుగా మనం జీవించాము. నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి భూమిమీదకు మనల్ని ఆయన పంపాడు. ఆయన పిల్లలు ప్రతిఒక్కరు చనిపోయిన తరువాత ఆయనతో జీవించడానికి మనం తిరిగి వెళ్ళాలని దేవుని యొక్క గొప్ప కోరిక. దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళ డానికి మనము తప్పక యేసు క్రీస్తును అనుసరించాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు.

ఆత్మ లోకములో ప్రకటిస్తున్న యేసు క్రీస్తు

ఆత్మ లోకములో ప్రకటిస్తున్న క్రీస్తు, రాబర్ట్ టి. బార్రెట్ చేత

యేసు క్రీస్తు

యేసు క్రీస్తు కూడా మాంసము, ఎముకలుగల పునరుత్థానము చెందిన శరీరమును కలిగియున్నాడు. ఆయన దేవుని యొక్క ప్రథమ కుమారుడు. మనము జన్మించకముందు, మన రక్షకునిగా ఉండటానికి దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. దీని అర్థము, యేసు క్రీస్తు మనకు మాదిరిగా ఉండటానికి, ఆయన సువార్తను బోధించడానికి, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికి, మరియు మరణము నుండి మనల్ని విడిపించడానికి భూమిమీదకు వచ్చాడు. యేసు క్రీస్తు వలన, మనము పశ్చాత్తాపపడినప్పుడు మన పాపములనుండి క్షమించబడతాము. యేసు క్రీస్తు కూడా అనేక బాధలు అనుభవించాడు, గనుక ఆయన అర్థము చేసుకొని, మనకు సహాయపడగలడు. యేసు క్రీస్తు మరణించి, ప్రతిఒక్కరూ మరలా జీవించడాన్ని సాధ్యపరుస్తూ, మరలా జీవించాడు.

క్రీస్తును సమాధి చేయుట

గెట్టి చిత్రాలనుండి ఛాయాచిత్రము

పరిశుద్ధాత్మ

పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సభ్యుడు, ఆయనకు భౌతిక శరీరము లేదు. ఆయన ఒక ఆత్మ. పరిశుద్ధాత్మ మన ఆత్మలతో నేరుగా సంభాషించగలడు. దేవుడు నిజమని, యేసు క్రీస్తు మన రక్షకుడని ఆయన మనకు సాక్ష్యమిస్తాడు. ప్రేమ, నడిపింపు, లేక ఓదార్పు భావనలను మనకివ్వడానికి దేవుని యొక్క రాయబారిగా పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. మనము బాప్తీస్మము పొంది, నిర్ధారించబడినప్పుడు, మనము పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుతాము. బాప్తీస్మము తరువాత, మనము దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, పరిశుద్ధాత్మ మనతో ఎల్లప్పుడు నిలిచియుండగలడు.

మొదటి దర్శనము

మొదటి దర్శనము, వాల్టర్ రేని చేత

జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము

కాలక్రమేణా ప్రజలు దేవుని గురించి అయోమయంలో పడ్డారు. దేవుడు, యేసు క్రీస్తు, మరియు పరిశుద్ధాత్మ గురించి ప్రజలు అంగీకరించలేదు. అందుకే జోసెఫ్ స్మిత్‌కు కలిగిన మొదటి దర్శనము చాలా ముఖ్యమైనదనుటకు ఇది ఒక కారణము. పరలోక తండ్రి మరియు యేసుక్రీస్తు శరీరాలను కలిగియున్నారని, వారు ఇద్దరు వేర్వేరు వ్యక్తులను అతడు చూసాడు.

ఆలకించుట

ఆలకించుట, మైఖేల్ జార్విస్ నెల్సన్ చేత

వేర్వేరు కానీ ఏకమైయున్నారు

దేవుడు, యేసు క్రీస్తు, మరియు పరిశుద్ధాత్మ ఒకే ఉద్దేశముగల వేర్వేరు వ్యక్తులని లేఖనాలు, మరియు ఆధునిక ప్రవక్తలు మనకు బోధిస్తున్నారు: మన అమర్త్యత్వము మరియు నిత్య జీవము (మోషే 1:39 చూడండి). ఒకే జట్టులోని సభ్యుల వలె, ప్రతీరోజు మనకు సహాయపడటానికి వారు కలిసి పనిచేస్తారు. మన పాపములకు మనము పశ్చాత్తాపపడి మరియు సరైనది ఎన్నుకొన్నప్పుడు వారికి దగ్గరగా మనము భావించగలము.

దైవసమూహము గురించి లేఖనాలు

  • పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు ఉద్దేశములో ఒకటిగా ఉన్నారు (యోహాను 10:30 చూడండి).

  • పరలోక తండ్రి తన కుమారునితో మాట్లాడాడు (మత్తయి 3:16–17 చూడండి).

  • యేసు క్రీస్తు తన తండ్రితో మాట్లాడాడు (యోహాను 11:41 చూడండి).

  • ఎదో ఒకరోజు మనము ఒకటి కావాలని యేసు క్రీస్తు మనకోసం ప్రార్థన చేసాడు (యోహాను 17:11 చూడండి).

  • పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తును జోసెఫ్ స్మిత్ చూసాడు (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17 చూడండి).

  • యేసు క్రీస్తు మన రక్షకుడని పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును (యోహాను 15:26 చూడండి).