2021
బయల్పాటు సూత్రంలోకి ఎదగండి
2021 జనవరి


“బయల్పాటు సూత్రంలోకి ఎదగండి,” లియహోనా, జనవరి 2021

2021 జనవరి, లియహోనా నెలవారీ సందేశము

బయల్పాటు సూత్రంలోకి ఎదగండి

ప్రభువును సరిగ్గా, మరింత తరచుగా వినడానికి అవసరమైన చర్యలను తీసుకోమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఆవిధంగా ఆయన మీకివ్వాలని కోరే జ్ఞానోదయాన్ని మీరు పొందగలరు.

మొక్క

గెట్టి చిత్రాలనుండి ఛాయాచిత్రము

2017 సెప్టెంబరు 30న, సర్వసభ్య సమావేశపు మధ్యాహ్నాకాల సభ తరువాత, నా ప్రియమైన సమూహ సభ్యుడైన ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్‌ని చూడడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. కొన్ని రోజుల క్రితం గుండె నొప్పితో బాధపడుతూ ఆయన ఆసుపత్రి‌లో చేరారు.

మేము అద్భుతంగా మాట్లాడుకున్నాము, మరియు ఆయన మెరుగుపడుతున్నట్లు కనబడ్డారు. ఆయన తన స్వంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నారు, అది మంచి సూచన.

అయినప్పటికీ ఆ సాయంత్రము, ఆత్మ నా హృదయం మరియు మనస్సుతో, ఆదివారము ఆసుపత్రికి తిరిగి వెళ్ళమని చెప్పింది. సర్వసభ్య సమావేశము యొక్క ఆదివారం ఉదయకాల సభలో, ఆ బలమైన భావన మరలా కలిగింది. సమావేశం ముగిసిన వెంటనే మధ్యాహ్నా భోజనం మానేసి, త్వరగా ఎల్డర్ హేల్స్ దగ్గరకు వెళ్ళాలని నేను భావించాను, అలాగే చేసాను.

నేను వెళ్ళినప్పుడు, ఎల్డర్ హేల్స్ పరిస్థితి విషమించడం నేను చూడగలిగాను. దురదృష్టవశాత్తూ, నేను వెళ్ళిన 10 నిముషాల తరువాత ఆయన చనిపోయారు, కానీ ఆయన ఈ జీవితం నుండి వెళ్ళిపోతుండగా, ఆయన ప్రియమైన భార్య మేరీ మరియు వారి ఇద్దరు కొడుకులతోపాటు ఆయన ప్రక్కన ఉన్నందుకు నేను కృతజ్ఞుడ్ని.

మరొకవిధంగా నేను చేయలేని దానిని చేయడానికి నన్ను ప్రేరేపించిన పరిశుద్ధాత్మ యొక్క గుసగుసల కొరకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను. బయల్పాటు యొక్క వాస్తవమునకు, మరొకసారి పరలోకములు తెరువబడినందుకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను.

ఈ సంవత్సరం మన వ్యక్తిగత మరియు తరగతి అధ్యయనం కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలపై మనం దృష్టిసారిస్తున్నాము. ఈ “దైవిక బయల్పాటులు మరియు ప్రేరేపించబడిన ప్రకటనలు” అన్నీ వాటిని అధ్యయనం చేసి, వాటి దైవిక నడిపింపుపై పని చేసే వారందరిని దీవించగలవు. “ప్రభువైన యేసు క్రీస్తు యొక్క స్వరమును వినుడి అని ప్రతీచోటనున్న జనులందరినీ”1 అవి ఆహ్వానిస్తాయి, ఏలయనగా నిజముగా “ప్రభువు స్వరము జనులందరికి వర్తించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:2).

అపాయము, అంధకారము, మోసము

కొవిడ్-19 మహమ్మారి మనకు జ్ఞాపకం చేసినట్లుగా శారీరక, ఆత్మీయ కష్టాలనేవి భూమి మీద జీవితంలో ఒక భాగం. ఆయన రెండవ రాకడకు ముందు సమయం గురించి మాట్లాడినప్పుడు, గొప్ప శ్రమ దినములు వస్తాయని రక్షకుడు ముందుగా చెప్పారు. “అక్కడక్కడ కరువులును తెగుళ్ళును భూకంపములును కలుగును” (జోసెఫ్ స్మిత్—మత్తయి 1:29) అని ఆయన అన్నారు.

అటువంటి శ్రమకు అదనంగా మన చుట్టూ అంధకారము మరియు మోసము పెరుగుతున్నాయి. యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా, ఆయన తిరిగి రాకముందు “దుష్టత్వము విస్తరించును” (జోసెఫ్ స్మిత్—మత్తయి 1:30).

సాతాను తన బలగాలను మోహరించి, ప్రభువు యొక్క కార్యానికి మరియు దానికి పూనుకొన్న మనకు వ్యతిరేకంగా కోపంగా ఉన్నాడు. మనము ఎదుర్కొనే అపాయాలు ఎక్కువవుతున్నందువలన, ముందెన్నడూ లేనంత ఎక్కువగా మనకు దైవిక నడిపింపు అవసరమయ్యింది మరియు మన మధ్యవర్తి, రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క స్వరాన్ని వినడానికి మన ప్రయత్నాలు ముందెన్నడూ లేనంతగా ఆవశ్యకమయ్యాయి.

ప్రభువు తన చిత్తాన్ని మనకు బయల్పరచడానికి సిద్ధంగా ఉన్నారని సంఘ అధ్యక్షునిగా నేను పిలువబడిన కొంత కాలానికే నేను చెప్పాను. అది ఆయన మనకిచ్చిన గొప్ప దీవెనలలో ఒకటి.2

మన కాలములో ఆయనిలా వాగ్దానమిచ్చారు, “నీవు అడిగినయెడల, బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును నీవు పొందెదవు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61).

ఆయన మన మనవులకు స్పందిస్తారని నాకు తెలుసు.

మనము ఆయనను ఎలా వింటాము

ఆత్మ ఎలా మాట్లాడుతుందో తెలుసుకోవడం నేడు ముఖ్యమైనది. వ్యక్తిగత బయల్పాటును పొందడానికి, జవాబులు పొందడానికి, భద్రతను, నడిపింపును పొందడానికి ప్రవక్త జోసెఫ్ స్మిత్ మనకోసం ఏర్పరచిన నమూనాను మనము జ్ఞాపకముంచుకోవాలి.

మొదట, మనము లేఖనాలపై పూర్తిగా దృష్టిసారించాలి. ఆవిధంగా చేయడం రక్షకుని బోధనలు మరియు సత్యాలను మన మనస్సులు, హృదయాలు గ్రహించేలా చేస్తుంది. ప్రత్యేకంగా ఈ అస్థిరమైన, తిరుగుబాటు దినములలో క్రీస్తు యొక్క మాటలు “[మనము] చేయవలసిన కార్యములన్నిటినీ [మనకు] బోధించును” (2 నీఫై 32:3).

తరువాత మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ప్రేరేపణ అవసరం, కాబట్టి దేవుని యెదుట మనల్ని మనం తగ్గించుకొని, మనం క్రమంగా వెళ్ళి, ఆయనకు మన హృదయాలను క్రుమ్మరించగల నిశ్శబ్ధమైన ప్రదేశాన్ని కనుగొనాలి.

“నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వచ్చెదను; శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు; అడుగుడి, మీకు ఇవ్వబడును; తట్టుడి, మీకది తెరువబడును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:63) అని ప్రభువు చెప్పారు.

ప్రభువు యొద్దకు రావడం ఓదార్పును, ప్రోత్సాహాన్ని, నిరీక్షణను మరియు స్వస్థతను తెస్తుంది. కాబట్టి మన చింతలు, మన బలహీనతలు, మన ఆపేక్షలు, మన ప్రియమైన వారు, మన పిలుపులు మరియు మన ప్రశ్నల గురించి ఆయన నామములో మనము ప్రార్థన చేయాలి.

తరువాత మనము వినాలి.

మనము ప్రార్థన ముగించిన తరువాత కొంతసేపు మోకాళ్ళపై ఉన్నట్లయితే, ఆలోచనలు, భావాలు మరియు నడిపింపు మన మనస్సులోకి వస్తాయి. ఈ భావాలను నమోదు చేయడం, మనం తీసుకోవాలని ప్రభువు కోరే చర్యలను జ్ఞాపకం ఉంచుకోవడానికి మనకు సహాయపడుతుంది.

అధ్యయనము చేస్తున్న స్త్రీ

ఈ ప్రక్రియను మనము పలుమార్లు చేసినప్పుడు, ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పినట్లు మనము “బయల్పాటు సూత్రంలోకి ఎదుగుతాము.”3

బయల్పాటు పొందడానికి యోగ్యులవడం

పరిశుద్ధాత్మ యొక్క గుసగుసలను గుర్తించడంలో మన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, బయల్పాటును పొందడంలో మన సామర్థ్యాన్ని హెచ్చించడానికి యోగ్యత అవసరము. యోగ్యతకు పరిపూర్ణత అవసరం లేదు, కానీ హెచ్చించబడిన పరిశుద్ధత కొరకు మనము ప్రయాసపడడం అవసరము.

అనుదిన ప్రయత్నం, అనుదిన వృద్ధి, అనుదిన పశ్చాత్తాపాన్ని ప్రభువు ఆశిస్తున్నారు. యోగ్యత పరిశుద్ధతను తెస్తుంది మరియు పరిశుద్ధత పరిశుద్ధాత్మ కొరకు మనల్ని యోగ్యులుగా చేస్తుంది. “పరిశుద్ధాత్మను [మన] మార్గదర్శిగా” (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:57) చేసుకున్నప్పుడు, వ్యక్తిగత బయల్పాటు కోసం మనం అర్హత పొందుతాము.

పరలోక నడిపింపుకు ద్వారము తెరవడానికి ఏదైనా మనల్ని ఆపినట్లయితే, మనము పశ్చాత్తాపపడవలసిన అవసరముండవచ్చు. ప్రభువు యొక్క స్వరమును మరింత తరచుగా, స్పష్టంగా మనం వినగలుగునట్లు ద్వారము తెరవడానికి పశ్చాత్తాపము మనకు వీలు కలిగిస్తుంది.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “ప్రమాణము స్పష్టమైనది.” “మనము ఆలోచించేది, చూసేది, వినేది లేక చేసేది ఏదైనా మనల్ని పరిశుద్ధాత్మ నుండి దూరం చేసినట్లయితే, మనము దానిని ఆలోచించడం, చూడడం, వినడం లేక చేయడం మానెయ్యాలి. ఉదాహరణకు, మనకు వినోదం కలిగించాల్సినదేదైనా పరిశుద్ధాత్మ నుండి మనల్ని దూరం చేస్తే, అటువంటి వినోదము నిశ్చయంగా మన కోసమైనది కాదు. అసభ్యకరమైన, అనాగరికమైన లేక అశ్లీలమైన దాని వద్ద ఆత్మ ఎన్నడూ నివసించదు, కనుక స్పష్టంగా అటువంటి విషయాలు మన కోసమైనవి కాదు.”4

హెచ్చైన పరిశుద్ధతను, విధేయతను మనము ఉపవాసము, శ్రద్ధగా వెదకుట, లేఖనాలను మరియు జీవిస్తున్న ప్రవక్తల మాటలను అధ్యయనం చేయడం, దేవాలయము, కుటుంబ చరిత్ర కార్యముతో జతపరచినప్పుడు పరలోకాలు తెరువబడతాయి. బదులుగా ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు: “నా ఆత్మను నీకిచ్చెదను, అది నీ మనస్సును వెలిగించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:13).

మనము ఓపికగా ఉండాల్సిరావచ్చు, కానీ దేవుడు తన స్వంత విధానములో, తన యుక్త కాలములో మనతో మాట్లాడతాడు.

గ్రహింపు యొక్క ఆత్మ

“అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును” (యోబు 32:8) అని యోబు ప్రకటించాడు. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభువును సరిగ్గా, మరింత తరచుగా వినడానికి అవసరమైన చర్యలను తీసుకోమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఆవిధంగా ఆయన మీకివ్వాలని కోరే జ్ఞానోదయాన్ని మీరు పొందగలరు.

2017 అక్టోబరులో ఆ రోజు ఎల్డర్ హేల్స్ చనిపోవడానికి ముందు, ఆయన సర్వసభ్య సమావేశం కొరకు ఒక చిన్న ప్రసంగాన్ని సిద్ధపరిచారు, కానీ ఆయన దానిని ఇవ్వలేకపోయారు. ఆ ప్రసంగములో ఆయనిలా వ్రాసారు, “ప్రభువు యొక్క సన్నిధిలో ఉండడానికి మన విశ్వాసము మనల్ని సిద్ధపరుస్తుంది.”5

మనము బయల్పాటును పొందినప్పుడు, ఆయన తన మనస్సును, చిత్తమును మరియు స్వరమును మనకు బయల్పరుస్తుండగా దేవుని సన్నిధిలో మనము సమయాన్ని గడుపుతాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:4 చూడండి). ఆయనకు ప్రార్థన చేసి, ఆయన వాగ్దానము చేసిన ప్రేరేపణకు యోగ్యులుగా జీవిస్తూ, మనము పొందే నడిపింపుపై పని చేస్తూ మన విశ్వాసమును క్రియలోనికి తీసుకొద్దాము.

వివరణలు

  1. సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క పీఠిక.

  2. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” Liahona, మే 2018, 94 చూడండి.

  3. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 132.

  4. డేవిడ్ ఎ. బెడ్నార్, “That We May Always Have His Spirit to Be with Us,” Liahona, మే 2006, 30.

  5. నీల్ ఎల్. ఆండర్సన్, “ప్రభువు యొక్క స్వరము,” Liahona, నవ. 2017, 125.