2025
యేసు క్రీస్తు మంచి రోజుల కోసం కూడా
యౌవనుల బలము కొరకు, 2025 సెప్టెంబరు


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 సెప్టెంబరు

యేసు క్రీస్తు మంచి రోజుల కోసం కూడా

పరిస్థితులు బాగున్నప్పుడు, మనం రక్షకునిపై దృష్టిని ఎలా నిలుపుకోవచ్చు? ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

సూర్యునికి ఎదురుగా ఉంచిన స్మైలీ ముఖాకారపు కట్‌ఔట్

ఒక స్నేహితుడు కేవలం తనకు కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే మీతో సమయం గడిపి, సంతోషంగా ఉన్నప్పుడు మిమ్మల్ని దూరంగా ఉంచితే ఎలా అనిపిస్తుందో ఊహించండి. ఆరోగ్యకరమైన సంబంధమా? నిజంగా కాదు.

మనం ఎప్పుడైనా మన రక్షకునికి అలా చేస్తామా—కష్ట సమయాల్లో ఆయనను వెతికి మరియు మంచి సమయాల్లో ఆయనను మరచిపోతామా?

బహుశా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి, మన కష్ట సమయాల్లో యేసు క్రీస్తు మనకు ఎలా సహాయం చేస్తారనే దాని గురించి మనం చాలా మాట్లాడుకుంటాము.

కానీ కొన్ని రోజులు—మనం అదృష్టవంతులైతే, కొన్ని వారాలు లేదా సంవత్సరాలపాటు కూడా — పరిస్థితులు నిజంగా బాగా నడుస్తుంటాయి. కొన్నిసార్లు మనం ఆ సమయాల్లో రక్షకుడిని మరచిపోతాము. మోర్మన్ గ్రంథంలోని ప్రజలు అలాగే చేశారు. వారు కొంతకాలం దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లారు, కానీ చివరికి ఆయనను మరచిపోయినప్పుడు గర్వానికి బలయ్యారు.

మంచి సమయాలు అంటే దాని అర్ధం మనకు అకస్మాత్తుగా యేసు క్రీస్తు అవసరం ఇంక లేదని కాదు. సమృద్ధికాలాలు అనేవి రక్షకునితో ఆనందించడానికి సరైన సమయాలు, ఆయనను మరచిపోవడానికి కాదు.

కాబట్టి, శోధనలు మనల్ని వారి వైపు తిరిగేలా గుర్తు చేయనప్పుడు, యేసు క్రీస్తుతో మరియు మన పరలోకమందున్న తండ్రితో మన సంబంధాన్ని మనం ఎలా కొనసాగించగలము?

వినయంగా ఉండండి

పరిస్థితులు బాగా నడుస్తున్నప్పుడు, మీ ఆశీర్వాదాలు మరియు విజయాలను సంబరాలుగా జరుపుకోవడం మంచిదే. కానీ మీరు ఉన్న చోటుకి చేరుకోవడానికి ఎవరు సాధ్య పరిచారో మర్చిపోకండి. రాజైన బెంజమిన్ తన మోర్మన్ గ్రంథము యొక్క ప్రసంగంలో ఈ విధంగా చెప్పాడు:

“ఇదిగో, మనమందరము బిచ్చగాళ్ళము కాదా? మనము కలిగియున్న సమస్తము కొరకు, ఆహార వస్త్రముల కొరకు, వెండి బంగారముల కొరకు, మనము కలిగియున్న సకల విధములైన సంపదల కొరకు ఆ దేవునిపై మనమందరము ఆధారపడిలేమా?” (మోషైయ 4:19).

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మీ కోసం చేసిన వాటిని గుర్తుంచుకోవడం ద్వారా మీ విజయాల్లో వినయంగా ఉండటం అనేది మీ మంచి సమయాలలో వారిని చేర్చుకోవడానికి ఒక గొప్ప మార్గం.

కృతజ్ఞతతో ఉండండి

కృతజ్ఞత అనేది అహంకారం మరియు మతిమరుపుకు ఉత్తమ విరుగుడులలో ఒకటి. దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వలన మీరు ఆయనను, మరియు ఆయన మరియు ఆయన కుమారుడు మీ జీవితంలో చేస్తున్న మంచిని గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఇది మంచి సమయాల్లో ఎంత ప్రభావవంతంగా ఉంటుందో, కష్ట సమయాల్లో కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుంది.

అప్రమత్తంగా ఉండండి

సాతానుకు ఇష్టమైన దాడులలో ఒకటి “శాంతపరచి, శరీర సంబంధమైన భద్రతాభావమునివ్వడం” (2 నీఫై 28:21). మరో మాటలో చెప్పాలంటే, మీరు మీ మంచి సమయాల్లో చాలా సంతృప్తిగా మరియు సురక్షితంగా ఉన్నట్లు భావించి, అత్యంత ముఖ్యమైన విషయాన్ని మీరు మరచిపోతే అతను దానిని చాలా ఇష్టపడతాడు. కాబట్టి, దేవున్ని మర్చిపోవద్దు! మీరు శత్రువు యొక్క సూక్ష్మ ఉపాయాలను తెలుసుకుని, మీ మంచి సమయాలలో కూడా వాటిని ప్రతిఘటించినప్పుడు, మీరు పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు దగ్గరగా ఉండగలరు.

యువతి

The Good Shepherd [మంచి కాపరి], మైఖేల్ మాల్మ్ చేత

క్రీస్తుపై కేంద్రీకృతమై ఉండండి

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “మన జీవితాల యొక్క దృష్టి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పై ఉన్నప్పుడు, మన జీవితాలలో—జరుగుచున్న దానిని లేదా జరగని దానిని లక్ష్యపెట్టకుండా మనం ఆనందాన్ని అనుభవించవచ్చును.” సంతోషము ఆయన వలన మరియు ఆయన నుండి వచ్చును. ఆయన సమస్త సంతోషము యొక్క మూలము.”

జీవితం బాగా సాగుతున్నప్పుడు ఆనందం గురించిన ఈ సత్యాన్ని మీరు ఎంత తరచుగా ఆలోచిస్తారు? ఇది పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు ఇచ్చే ఓదార్పుకరమైన సలహా మాత్రమే కాదు. మీ మంచి రోజులతో సహా, ఇది ఎల్లప్పుడూ నిజం. కాబట్టి, మంచి వచ్చినా చెడు వచ్చినా, క్రీస్తుపై దృష్టి పెట్టడానికి మీరు చేయగలిగినదంతా చేయండి.

వివరణ

  1. Russell M. Nelson, Oct. 2016 general conference (Ensign or Liahona, Nov. 2016, 82).