2025
యేసు క్రీస్తు నుండి సహాయం: ఎందుకు మరియు ఎలా
యౌవనుల బలము కొరకు 2025 ఏప్రిల్


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 ఏప్రిల్

యేసు క్రీస్తు నుండి సహాయం: ఎందుకు మరియు ఎలా

యేసు క్రీస్తు ఎందుకు ఒక సమాధానమో మరియు ఆయన మీకు ఎలా సహాయం చేస్తున్నారో అర్థం చేసుకోండి.

యేసు క్రీస్తు

డాన్ విల్సన్ చేత వివరణలు

“నాకు ఎప్పుడూ నేను తప్పులు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ప్రయత్నిస్తూ ఉండడం కష్టంగా ఉంది.”

“నా పరిస్థితి కష్టమైనది. ఎలా ముందుకు కొనసాగాలో నాకు తెలియటం లేదు.”

“నాకు భవిష్యత్తు గురించి చింతగా ఉంది. విజయం సాధించడానికి కావాల్సిన సామర్ధ్యం నా వద్ద ఉందొ లేదో నాకు తెలియదు.”

“నేను అలసిపోయాను, అయినప్పటికిని చేయవలసింది ఇంకా చాలా ఉంది.”

ఈ సమస్యలలో ఏదైనా మీరు ఎదుర్కొన్నారా? “మీకు ఎటువంటి ప్రశ్నలు లేదా సమస్యలున్నా, జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలలో కనుగొనబడుతుంది”, అని అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ మనకు బోధించారు, (“జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే,” 2023 ఏప్రిల్. సర్వసభ్య సమావేశము [Liahona, May 2023, 127]).

“యేసు క్రీస్తే సమాధానం” అని చెప్పడం చాలా సులభం. ఆయన ఎందుకు మరియు ఎలా సమాధానం అన్నది అర్థం చేసుకోవడానికి, కొంచెం ఎక్కువ ప్రయత్నం అవసరం పడుతుంది.

యేసు క్రీస్తే ఎందుకు సమాధానం?

ఆయన తన ప్రాయశ్చిత్త త్యాగాన్ని భరించినప్పుడు, రక్షకుడు మూడు గొప్ప కార్యములు చేశారు:

  1. ఆయన మరణాన్ని జయించి, మనకు పునరుత్థానం పొందే అవకాశాన్ని కలిగించారు.

  2. ఆయన అన్ని పాపాలకు మూల్యం చెల్లించడం వలన, మనం పశ్చాత్తాపపడటం, ఎదగడం మరియు దేవుని వద్దకు తిరిగి వెళ్ళడం సాధ్యమవుతుంది. క్రీస్తు ప్రతి ఒక్కరి పాపాలను తనపైకి తీసుకున్నారు కాబట్టి, ఇతరులు పాపం చేసినప్పుడు వారిని క్షమించడానికి కూడా ఇది మనకి సహాయపడుతుంది.

  3. ఆయన సమస్త బాధలు, శ్రమలు, శోధనలు, రోగములు, మరియు బలహీనతలను అనుభవించారు (ఆల్మా 7:11–13చూడండి). దాని అర్ధం, మీకు ఎలా సహాయం చేయాలో మరియు స్వస్థపరచాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు మరియు శోధనలను తట్టుకునేలా మరియు మంచిగా మారడానికి మిమ్మల్ని బలపరచగలరు.

ఏ సమస్యనైనా ఎంచుకోండి, మరియు మీరు దాని పరిష్కారాన్ని ఆ మూడు సత్యాలలో ఒకటికి లేదా అంతకంటే ఎక్కువకు అనుసంధానించగలరు.

పేదరికమా? యేసు క్రీస్తు అన్ని విషయాలను అనుభవించారు కాబట్టి, అది ఎలా ఉంటుందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన ఎల్లప్పుడూ అడ్డంకిని తొలగించకపోవచ్చు, కానీ ఆ భారాన్ని మోస్తున్న ప్రజలను బలపరచగలరు (మోషైయ 24:15 చూడండి).

వైఫల్యమా? క్రీస్తు పాపాన్ని జయించారు కాబట్టి, మన వైఫల్యాలు శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. పశ్చాత్తాపం అనేది మెరుగుపడటం మరియు ఆయన మన గురించి ఊహించిన వ్యక్తిగా మారేందుకు ప్రయత్నించడంతో కూడుకుని ఉంటుంది.

అనారోగ్యమా? ఆయన మరణాన్ని జయించినందువలన, మనం రోగాలు మరియు నొప్పికి అతీతమైన పరిపూర్ణ శరీరాలతో పునరుత్థానమవుతాము. క్రీస్తు “ఆయన తనపైకి … అనారోగ్యాలను కూడా [తీసుకున్నారు]” (ఆల్మా 7:11), అది, ఆయనను ఆదరణ మరియు మద్దతు అందించడానికి పరిపూర్ణ వ్యక్తిగా చేస్తుంది.

క్రీస్తు ఎలా సహాయం చేస్తారు?

అయితే రక్షకుడు ఎందుకు సమాధానమో మనకు తెలిసినప్పటికీ (ఆయన ఎవరు మరియు ఆయన మన కోసం ఏమి చేసారో దాని వలన), ఆయన నుండి మనకు సహాయం మరియు బలం ఎలా లభిస్తాయో మనం ఇంకా తెలుసుకోవాలి. వాటిలో కొన్ని మార్గాలు ఇవి:

ప్రార్థన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడం ద్వారా, మనలాంటి అపరిపూర్ణమైన మనుషులు పరిపూర్ణమైన దేవునితో మాట్లాడగలుగుతారు. ఏ పరిస్థితిలోనైనా మనకు అవసరమైన బలం కోసం మనం ప్రార్థించగలం, మరియు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తారు—అది మనం ఆశించిన విధంగా కాకపోవచ్చు, కానీ మనకు ఆశీర్వాదంగా మారే విధంగా ఉంటుంది. రక్షకుని యొక్క ఆహ్వానం నిజమైనది: “అడుగుడి, మీకియ్యబడును”(యోహాను 16:24; 3 నీఫై 27:29; సిద్ధాంతము మరియు నిబంధనలు 4:7).

పరిశుద్ధాత్మ వరము. పరలోక తండ్రి, యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ఒకే ఉద్దేశ్యంలో ఏకమై ఉన్నారు. వారు కలిసి పని చేస్తారు! ఎప్పుడైనా మీరు పరిశుద్ధాత్మ నుండి మార్గదర్శకత్వం లేదా ఆదరణను పొందుతున్నప్పుడు, క్రీస్తు కూడా మీకు సహాయం చేస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు.

నిబంధనలను పాటించడం. ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఈ విధముగా బోధించారు: “నిబంధన బాట అనే పదము నిబంధనల వరుసను సూచిస్తుంది, తద్వారా మనం క్రీస్తు నొద్దకు వస్తాము మరియు ఆయనతో మన బంధాన్ని బలపరచుకుంటాము. ఈ నిబంధన బంధము ద్వారా, మనం ఆయన నిత్య శక్తిని పొందుతాము.” (ఏప్రిల్. 2023 సర్వసభ్య సమావేశము [Liahona, May 2023, 36]).

కృప. మనం యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచి, పశ్చాత్తాపపడినప్పుడు, మనం స్వంతంగా చేయలేని వాటిని సాధించడానికి అదనపు సహాయం మరియు బలాన్ని (కృప అని కూడా పిలుస్తారు) పొందవచ్చు (see Guide to the Scriptures, “Grace”). ఈ బలం, లేదా కృప, అనేక విధాలుగా రావచ్చు: పరిశుద్ధాత్మ నుండి, ఒక స్నేహితుడు నుండి, అపరిచితుడు నుండి, ఒక అనుభూతి నుండి. ప్రాథమికంగా, ఏ మంచి అయినా క్రీస్తు నుండి వస్తుంది ( మొరోనై 7:22 చూడండి). మీరు కొంత ఎక్కువ ఓపిక, మరికొంత శక్తి, సహించటానికి మరికొంత బలాన్ని కనుగొన్నప్పుడు, క్రీస్తు మీకు సహాయం చేస్తున్నారని గుర్తించండి.

ఎందుకు మరియు ఎలా అనేవి గుర్తుంచుకోండి

కాబట్టి, తదుపరిసారి మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్నకు లేదా సమస్యకు సమాధానం అవసరమైనప్పుడు, క్రీస్తు వైపు చూడండి. ఆయన పాపం, మరణం, మరియు ఇతర మర్త్య సవాళ్లపై విజయం సాధించినందున, ఏదీ అసాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆయన మీకు ఎలా దీవెనలను అందించగలరో చూడండి, అప్పుడు మీ జీవితంలో ఆయన ప్రభావాన్ని మీరు చూస్తారు. ఆయన మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారు!